Tuesday, June 28, 2011

కాలం కొవ్వొత్తిలా కరుగుతూ.....

జ్ఞాపకాల వెలుగు పూలను విరబూయిస్తూనే ఉంటుంది!

వెనక్కి తిరిగి చూసుకుంటే గడిచిన బడిప్రయాణపు పిల్లగాలి చల్లగా పలకరిస్తుoది!!
బాల్యం బాగున్నావా అని ఆప్యాయంగా అడుగుతుంది!!!

బడి గంటకు భయపడి పరిగె త్తింది జ్ఞాపకమే!

బడిని వీడిన చివరిరోజు రాలిన కన్నీరు జ్ఞాపకమే!!

మామిడి పండుకై హెడ్ మాస్టర్ తిట్టినప్పుడు,

మార్కుల కోసం, ర్యాoకుల కోసం తపన పడినప్పుడు,

ఆ బాధ జ్ఞాపకం!

ఆ ఆనందమూ జ్ఞాపకం!


అల్లరి నిండిన ఆ చల్లని రోజులు స్తబ్ధత కొలువైన నేడుని వెక్కిరిస్తున్నట్టు,

ఆశతోనిండిన ఆ చిన్నారి కళ్ళు యాంత్రికమైపొయిన నన్ను చూసి ప్రశ్నిస్తున్నట్టు,

అపుడు తెలియని ఆ ఆనందం ఇపుడు గుర్తుకొచ్చి గుండె బరువెక్కినట్టు,

ఏదోబాధ , ఏదోఆనందం !!!

నా జ్ఞాపకాలలో కొలువున్న మీకు
కృతజ్ఞతా కుసుమాలను సమర్పించి ఉడుతాభక్తిని చాటుకోవాలని నా ఈ చిన్నప్రయత్నం !!!

Saturday, June 4, 2011


నువ్వు గాలివి
నేను చెట్టుని

నువ్వేమన్నా తల ఊపడమే
నా పని!

నా గుండెనే గుడిలా చేసి
నిన్ను కొలువుండమంటే...

నువ్వేమో,
ఉక్కబోస్తోందనీ
ఊపిరాడటంలేదనీ
నన్ను తిట్టుకుంటున్నావ్!!!

ఆ పెద్దాయన
మనసులో ఏమీ దాచుకోడు..
అందుకేనేమో
పర్సు లో కూడా
ఏమీ దాచుకోలేకపోయాడు!

రాయి కనబడితే చాలు...
ఆగి మొక్కేస్తాం !
అదే రాయి
బియ్యంలో కనిపిస్తే...
శాపాలు పెట్టేస్తాం !!

ఆమె కోసం
ఎదురుచూస్తున్నాడు
అతను...!
పట్టాల మీద
పదిపైసల బిళ్లపెట్టి
రైలుబండి కోసం
ఎదురుచూస్తున్న చిన్నపిల్లాడిలా!!

ప్లాస్టిక్ వినియోగం
బాగా పెరిగిపోతోంది..
పువ్వులే కాదు
ఆఖరికి
నవ్వులు కూడా
ప్లాస్టిక్‌వే!

అసెంబ్లీలో
కుర్చీలు...మైకులు
విరగ్గొట్టడం నుంచి,
టాంక్‌బండ్ మీద
విగ్రహాలు పగలగొట్టడం వరకూ..
ఆహా..
ఎంత ఎదిగిపోయింది రాజకీయం?!

శీతాకాలం
తెల్లవారు ఝాము
మంచు కురుస్తోంది...
అప్పుడే వాయతీసిన
వేడి వేడి ఇడ్లీలమీద పొగలా!

ఎప్పుడో టూరింగ్‌టాకీస్ లో
చూసిన సినిమా..
ఇప్పుడు మళ్ళీ
నా హోమ్‌ధియేటర్ లో...!
ప్చ్ ...
ఒళ్ళో కూచోబెట్టుకున్న తాతయ్యేలేడు!

ఆమె ఉత్తర దిక్కు..
నేను దక్షిణదిక్కు..
అందుకేనేమో
ఎన్ని ఉత్తరాలు రాసినా
స్పందించట్లేదు!!

అందమైన అమ్మాయి కనిపించగానే
చూపులన్నీ
పాదాలమీదే!.
హమ్మయ్య..
మెట్టెల్లేవ్..
ఆమె నాదే!

సెల్ ఫోన్‌లో టాక్‌‍టైం
అయిపోగానే
రీఛార్జ్ చేయించుకునే అవకాశం ఉన్నట్టే..

జీవితంలో అప్పుడప్పుడూ దూరమైపోయే
కొంచెం ఆనందాన్నీ,
ఇంకొంచెం మనశ్శాంతినీ
రీఛార్జ్‌చేసుకునే సౌకర్యం
ఉంటే ఎంత బాగుణ్ణో!!!

ఇప్పుడంటే రెండేగానీ...
చిన్నప్పుడు నాకు మూడు కళ్లు!
పుస్తకంలో
దాచుకున్న
నెమలికన్నుతో కలిపి!!!